బంగారుతల్లి కబుర్లు

మార్చి 17, 2011

“నిజ్జం” భౌభౌ — “ఉత్తుత్తి” భౌభౌ

Filed under: టాటా — బంగారుతల్లి @ 5:57 సా.

నా భౌభౌలు

నా భౌభౌలు

చాలాకాలం తల్వాత మీ అందలికీ హలో.

ఏమైంది? మాయమైపోయావ్? అంతూ చాలా మంది అడిగాలు కానీ, నాన్నాలి బిజీ ఉద్యోగం గులించి తెలుసుకదా.  అందుకే నా కబుర్లు మీతో పంచుకోవతానికి ఆయనికి తీరిక దొలకలేదు.  అప్పులప్పులు పాపం.ఇంతికొచ్చేసలికి బాగా లాత్రయిపోయేది.  నలేలే.  ఇప్పుడు ఇంక ఖాళీయేలే అన్నాలు కదా.  అందుకే మళ్ళీ వచ్చా.

ముందుగా మీతో చెప్పాల్సిన విషయం ఒకతి.  నేను ఇప్పుడు బాగా పెద్దదాన్నయిపోయాను.  అన్నం తినేస్తున్నాను.  ఇల్లంతా తెగ తిలిగేస్తున్నాను.  లోజూ షికాలుకి కూడా వెళ్ళిపోతున్నాను.  బోళ్ళు ఊళ్ళు తిలిగేశాను కూడాను.  ఆ విశేషాలన్నీ మీకు చెప్పేస్తానే.

మొన్నొక వింత జలిగింది.

చాలాకాలం తల్వాత నాన్నాలు అమ్మని, నన్ను బజాలుకి తీసుకెళ్ళాలు కదా.  ముందుగా కావేలీ కి వెళ్ళాం.  అంతే అది బొమ్మలకొత్తన్నమాత.  చిన్నవి, పెద్దవి ఇలా ఎన్నో బొమ్మలున్నాయి.  అమ్మ నాకో బొమ్మకొంది.  బలేబలేగా చప్పుడుచేసే విసనకల్లలాంతి బొమ్మన్నమాత.  దానితో ఆడుకుంటుంటే, నాన్నాలు మమ్మల్ని ఇంకో పేద్ద కొత్తులోకి తీసుకెళ్ళాలు.

అక్కడన్నీ గాజులు, గొలుసులూ ఉన్నాయి.  అమ్మ ఏం కొనుక్కుందామా అని చూస్తూ, నాన్నాలిని అప్పులప్పుడు ఇది బావుందా, అది బావుందా అని అడగడం, నాన్నాలేమో అన్నీ బానే ఉన్నాయనడం!  పాపం వీటి గులించి నాన్నాలికి ఏమీతెలీదు కదా.  అప్పుడు నేను ఆయన్ను లక్షించేద్దామని ఒకసాలి గాఠిగా అలిచా.  వెంటనే “అలాగామ్మా” అంటూ నన్ను ఆ కొత్తంతా తిప్పడానికి తీసుకెళ్ళేసారు – ఆనందంగా!!

అప్పులు బాగా నవ్వేశాను

అప్పులు బాగా నవ్వేశాను

అలా అలా నడుస్తూ నడుస్తూ ఒక చోట ఆగాను, ఆయసం వచ్చి.  పైకి చూస్తే,,, హహ్హాహ్హా… బలే బలే “భౌ భౌ” కనిపించింది.  ఒకాయన ఎత్తుకుని ఉన్నాలు.  నాకసలే భౌభౌ అంటే చాలా ఇష్టం కదా.  నాన్నాలిదగ్గల గాలంపోయాను, ముద్దుగా.  నాకది కావాలని అడిగాను.  అప్పులు నాన్నాలు “బంగాలుతల్లీ, అది నిజం భౌభౌ అమ్మా, బొమ్మకాదు” అన్నాలు.  అయినా నాకది చాలా నచ్చింది.  అందుకనీ ఇంకా ముద్దుగా గాలంపోయాను.  అప్పుడు, నేను ముద్దొచ్చి, పక్కాయన ఆ భౌభౌని పత్తుకుని కిందకు వంగారు, “చూడమ్మా” అంటూ.  కానీ నాచేతికివ్వలేదు.  మరి చూడాలంటే దాన్ని పత్తుకోవాలి కదా.  అందుకే దాని జుత్తుపత్తుకుని ఒక్కలాగు లాగాను.  విచిత్రంగా ఈ భౌభౌ కుయ్యికుయ్యిమంది (అంటే, నా దగ్గరున్న భౌభౌ ఐతే అస్సలు అలవదులే).

అంతే అందలూ ఒక్కసాలిగా నా చేతులు గాఠిగా పత్తేసుకుని నన్ను దూరంగా లాగేసాలు.  అప్పటికే నా గుప్పిట్లోకి కుంచెం భౌభౌ జుత్తు వచ్చేసిందిలే.  నాన్నాలేమో పక్కాయనతో “సాలీ” అంటూ ఏదో ఇంగ్లీషులో మాట్లాడేస్తున్నాలు.  ఆయనేమో నాకేసి అదోలా చూశాడు. నాకేమో ఏడుపొచ్చింది.  కోపంకూడా కుంచెం వచ్చింది.  మరి రాదేంటి.  నాకసలే భౌభౌ అంటే చాలాఇష్టం కదా.  అందుకే తర్వాత నాన్నాలు పలకరించినా పలకలేదు.

అప్పుడు నాన్నాలు నన్ను కిందకి తీసుకెళ్ళి చాలా నచ్చచెప్పాలు – “అల్లిబిల్లీ (మరీ ముద్దొస్తే అలానే పిలుస్తాలు), అది నిజం భౌభౌ అమ్మా.  అల్లా లాగితే దానికి నొప్పెడుతుందికదా.  అందుకే అలాచేయకూడదేం” అంటూ.  నాకేంటో, తెలిసీతెలియకుండా ఉంది.  భౌభౌ అంటే భౌభౌనే కదా.  మళ్ళీ ఈ “నిజ్జం” భౌభౌ ఏంటి??  ఇంకొంచెంసేపు ఆలోచిస్తే నాకు తెలిసిపోయేదే కానీ, ఈలోగా నాన్నాలు నన్ను ఎత్తుకుని, గాఠిగా కౌగలించేసుకుని ముద్దుచేసేసాలు.  దాంతో నాకోపం పోయి నేనూ నవ్వేసాను.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.